జానపదం ఎవరి సొంత జాగీరు కాదు

గరివిడి లక్ష్మి వివాదం మీద సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో …”ఉత్తరాంధ్ర జానపదం ఏ ఒక్కరి సొత్తు కాదు… అది అందరిది… నాది కూడా” అని పదే పదే చెప్పారు… వాపోయారు… కొన్నిసార్లు ప్రకటించారు కూడానూ! వినడానికి ఈ మాటలు చాలా గంభీరంగా… ఆదర్శవంతంగా అనిపిస్తాయి. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది.
జానపదం అనేది ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అయినప్పుడు మరియు అది ఏ ఒక్కరి సొత్తు కానప్పుడు ఆ పాటలు సినిమాలో పెట్టినప్పుడు ఆడియో క్యాసెట్ల మీద యూట్యూబ్ క్రెడిట్స్ లో ఇది జానపదం లేదా ఇది ప్రజల ఆస్తి అని ఎందుకు ఎక్కడా రాయరు. కేవలం సంగీతం ఆర్పీ పట్నాయక్ అని లేదా ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ అని మాత్రమే ఎందుకు వేసుకుంటారు. ఒక పల్లెటూరి పాటను వాడుకున్నప్పుడు కనీసం ఒక చిన్న అక్షరంతో ఇది జానపదం అని క్రెడిట్ ఇవ్వడానికి వీళ్ళ ఇగో ఎందుకు అడ్డొస్తుంది.
అన్నిటికంటే దారుణమైన విషయం మరొకటి ఉంది. ఈ పాటలను రేపు పొద్దున్న ఎవరైనా సామాన్యుడు పాడుకుని యూట్యూబ్ లో పెట్టుకుంటే వెంటనే ఈ బడా మ్యూజిక్ కంపెనీలు వాళ్ళ మీద కాపీరైట్ స్ట్రైక్ వేసి వీడియోలు డిలీట్ చేయిస్తున్నాయి. అసలు ప్రజల పాటకు వీళ్ళకి కాపీరైట్ ఇచ్చింది ఎవరు. జనం సొత్తును తమ సొంత ఖాతాలో వేసుకునే ఈ అధికార పత్రాలను వీళ్ళకు ఎవడు రాసిచ్చాడు. తమకు తాముగా ఒక దొంగ పట్టా సృష్టించుకుని అదే నిజం అని నమ్మించే ప్రయత్నం ఇది.
సరిగ్గా ఇలాంటి దోపిడీనే మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల విషయంలో కూడా చూస్తున్నాం. వందల ఏళ్లుగా పల్లెల్లో చర్చిల్లో సామాన్య ప్రజలు ఎంతో భక్తితో పాడుకునే కీర్తనలను ఈమధ్య కొందరు కొత్తగా రీమిక్స్ చేస్తున్నారు. దానికి రెండు కీబోర్డు సౌండ్లు తగిలించి ఆ పాత కీర్తనను తమ సొంత ఛానల్లో పెట్టుకుని దానికి కాపీరైట్ కొట్టేస్తున్నారు. ఆ తర్వాత ఎవరైనా ఆ కీర్తనను పాడితే వాళ్ళ మీద స్ట్రైకులు వేస్తున్నారు. తరతరాలుగా ఒక సమూహం పాడుకుంటున్న భక్తి గీతానికి యజమానులు వీళ్ళా??? ఎవరు ఇచ్చారు వీళ్ళకు ఈ హక్కు???
ఆర్పీ పట్నాయక్ గారు తన ఇంటర్వ్యూలో ఇంకొక అహంకారపూరితమైన మాట చెప్పారు. ఉత్తరాంధ్ర జానపదాన్ని తాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాను అని ఒక దేవుడిలాగానో లేదా ఉద్ధారకుడిలాగానో ఫీల్ అవుతూ చెప్పారు. ఇది పచ్చి సేవియర్ కాంప్లెక్స్. అట్టడుగు వర్గాల కళలను మేమే ఉద్ధరించాము అని ఫీల్ అయ్యే ఒక మేధోపరమైన అహంకారం ఇది. అసలు జానపదాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళడానికి ఆయన ఎవరు. ఆ పాటలు పుట్టిన మట్టిలో ఆ ప్రజల ఆకలిలో ఆ కష్టంలో ఆ పాటలు అప్పటికే అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఒక ఏసీ గదిలో కూర్చుని కీబోర్డు వాయించేవాడు దానికి ఒక బీట్ యాడ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ అయిపోదు. జనం పాడుకునే పాటలకు ఈ సినిమా వాళ్ళ సర్టిఫికెట్లు అస్సలు అవసరం లేదు.
చరిత్రలో ఒకప్పుడు ఎన్‌క్లోజర్ ఆఫ్ కామన్స్ అని ఒక పద్ధతి ఉండేది. ఊరందరికీ చెందిన ఉమ్మడి ఆస్తిని కొందరు భూస్వాములు కంచె వేసి తమ సొంతం చేసుకునేవారు. ఇప్పుడు ఈ కాపీరైట్ ఇండస్ట్రీ కూడా అదే చేస్తోంది. సాంస్కృతిక భూములకు కాపీరైట్ అనే కంచె వేసి అది తమ సొంత ఆస్తి అని బోర్డులు పెడుతున్నాయి. పీడిత ప్రజల కళను లాక్కుని దాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చి మళ్ళీ ఆ ప్రజలకే అమ్ముకోవడం అనే ఆంటోనియో గ్రామ్షీ కల్చరల్ హెజిమొనీ సిద్ధాంతం ఇక్కడ అక్షరాలా సరిపోతుంది. ఆ పాటలో మొదటి రెండు లైన్లు మాత్రమే తీసుకున్నాము మిగతాదంతా తామే రాశామని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆ మొదటి రెండు లైన్లలోనే ఆ పాట అసలు ప్రాణం మరియు మట్టి వాసన దాగిన విషయం వీళ్ళకు బాగా తెలుసు. ఆ ప్రాణాన్ని దొంగిలించి మిగతా పాటకు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇది నా బిడ్డ అని చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం.
ఈరోజు కాపీరైట్ చట్టాలు కూడా డబ్బున్న కార్పొరేట్ కంపెనీలకే చుట్టాలుగా మారాయి. ఒక కవి రాసిన ట్యూన్ కాపీ కొడితే కోర్టుల దాకా వెళ్లే ఈ కంపెనీలు అదే జనం పాటను కాపీ కొడితే మాత్రం మాకు ఇన్స్పిరేషన్ అని ముద్దు పేర్లు పెట్టుకుంటాయి.
ఈ సాంస్కృతిక పైరసీకి వెంటనే ఒక ముగింపు పలకాలి. సినిమాల్లో లేదా ఆల్బమ్స్ లో జానపదాలను వాడుకున్నప్పుడు కచ్చితంగా ఇది జానపదం మరియు ఇది ప్రజల ఆస్తి అని ఆడియో క్రెడిట్స్ లో పెద్ద అక్షరాలతో వేయాలనే ఒక కఠినమైన రూల్ రావాలి. ఒక ప్రజల పాటను సినిమాలో వాడుకుంటే …ఆ పాటకు వాళ్ళకు ఎలాంటి కాపీరైట్ హక్కులు దక్కకుండా చట్టాలు మారాలి. జానపదం అనేది ఎవరి సొంత జాగీరు కాదు… అది గాలి లాంటిది ఆకాశం లాంటిది. దాన్ని బాక్సుల్లో బంధించి అమ్ముకుంటాం అంటే చూస్తూ ఊరుకోవడానికి జనం ఎప్పటికీ సిద్ధంగా లేరు. ఆ మట్టి పాటలు ఏ ఒక్క సినిమావాడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకడం లేదు. అవి జనం గుండెల్లో పుట్టాయి జనం నాల్కల మీదే శాశ్వతంగా బతుకుతాయి.
– పిటి పార్కర్