ద్వంద్వార్థం: మాట అర్థం మీద పెత్తనం ఎవరిది?

ప్రతి మాటకు ఒకే ఒక స్థిరమైన అర్థం ఉంటే ఈ ప్రపంచం ఎంత విసుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఒక మాటకు ఒకటే అర్థం ఉండి అది అందరికీ ఒకేలా అర్థమైతే ఇక కవిత్వానికి ప్రాణం ఎక్కడ ఉంటుంది? అది భాష కాదు కేవలం గణిత శాస్త్రం అవుతుంది. ఒక సమీకరణం ఎప్పుడూ ఒకే జవాబు ఇస్తుంది కానీ ఒక పద్యం చదివిన ప్రతిసారీ కొత్తగా పుడుతుంది.
సృజనాత్మకతకు ఊపిరి పోసేదే ఈ అనిశ్చితి. ఒక మాటకు ఉన్న పై అర్థాన్ని చీల్చుకుని లోపలి నుంచి ఇంకో అర్థం బయటకు వచ్చినప్పుడే భాష ఒక అద్భుతం అవుతుంది. కానీ ఒక జానపద కళాకారిణి బుర్రకథ పాడుతూ ఒక మాటను కొంచెం సాగదీస్తే చాలు మన సమాజంలో నైతికత అమాంతం నిద్రలేస్తుంది. ఆమె పాటలన్నీ ద్వంద్వార్థాలే అని కొందరు చాలా తేలికగా తీర్పులు ఇచ్చేస్తారు. అదే సమయంలో తెర మీద కోట్లు తీసుకునే హీరో స్పెషల్ సాంగ్(ఐటమ్ సాంగ్ అని చెప్పడం ఇష్టం లేక) పాడుతూ అవే ద్వంద్వార్థాలు పలికితే అది మాస్ సాంగ్ అవుతుంది. అసలు ఒక మాటకు అర్థం ఎక్కడి నుంచి వస్తుంది మరియు ఆ అర్థం మీద పెత్తనం ఎవరిది అన్నది సాహిత్య విమర్శలో ఎప్పటికీ తేలని ఒక విషయం.
నిఘంటువు అనే ఒక పవిత్రమైన పుస్తకం ఉందని అందులో ప్రతి మాటకు ఒక అసలు అర్థం భద్రంగా దాచి పెట్టి ఉంటుందని కొందరు గుడ్డిగా నమ్ముతారు. కానీ ఆధునిక భాషాశాస్త్ర పితామహుడు ఫెర్డినాండ్ డి సాసర్ ఈ భ్రమను ఏనాడో తీసి అవతల పారేశాడు. సాసర్ సిద్ధాంతం ప్రకారం ఒక శబ్దానికీ దాని అర్థానికీ పుట్టుకతో వచ్చిన బంధం ఏమీ లేదు. మాటలు కేవలం గాలి బుడగలు. అవి వాటికవే ఎలాంటి అర్థాన్నీ మోసుకురావు. జనం ఒక ఒప్పందం ద్వారా ఆ శబ్దాలకు ఒక ముద్ర వేస్తారు…. అంతే! జాక్వెస్ డెరిడా లాంటి ఫ్రెంచి తత్త్వవేత్తలు పోస్ట్ స్ట్రక్చరలిజం ద్వారా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. భాషకు స్థిరత్వం లేదని డెరిడా తేల్చి చెప్పాడు. ప్రతి మాటా ఎప్పుడూ ఇంకో మాట మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అర్థం ఎప్పుడూ చేజారిపోతూనే ఉంటుంది అన్నాడు. ఈ లెక్కన ప్రతి మాటా ఒక ఖాళీ కుండ లాంటిది. ఆ మాటలు ప్రాథమికంగా అర్థరహితమైనవి కాబట్టే మనుషులు తమ సంస్కృతిని విమర్శను మరియు సృజనాత్మకతను అందులో నింపుకునే అవకాశం దొరికింది.
మరి ఆ ఖాళీ కుండను నింపేది ఎవరు అనే ప్రశ్నకు పాశ్చాత్య సాహిత్య విమర్శలోని రీడర్ రెస్పాన్స్ థియరీ ఒక అద్భుతమైన జవాబు ఇచ్చింది. రోలాండ్ బార్త్ అనే విమర్శకుడు ఏకంగా రచయిత మరణం అనే ఒక బాంబు లాంటి సిద్ధాంతాన్ని ప్రకటించాడు. ఒక పాట లేదా ఒక పుస్తకం బయటకు రాగానే దాన్ని రాసినవాడు సైద్ధాంతికంగా చచ్చిపోతాడు అని బార్త్ వాదన. అంటే రచయిత మనసులో ఏముంది అన్నది ముఖ్యం కాదు. ఆ రచన చదువుతున్న పాఠకుడి మనసులో ఆ మాటలు ఏం చేస్తున్నాయి… వారికి ఎలా అర్ధం అవుతున్నాయి అన్నదే అసలైన అర్థం.
ఒక పల్లెటూరి జాతరలో జనం ఒక పాటకు పగలబడి నవ్వుతున్నారంటే లేదా వెకిలిగా నవ్వుతున్నారంటే ఆ పాటను వాళ్ళు పాడుచేస్తున్నట్టు కాదు. వాళ్ళ సామాజిక అనుభవాల ద్వారా ఆ పాటకు ఒక కొత్త ప్రాణం పోస్తున్నట్టు లెక్క. అర్థం అనేది పాటలో నిక్షిప్తమై లేదు. వినేవాడి సామాజిక నేపథ్యానికీ ఆ పాటకు మధ్య జరిగే రసాయన ప్రతిచర్యలో ఉంది.
ఈ సిద్ధాంతాలన్నీ పాశ్చాత్యులు కనిపెట్టక ముందే మన ప్రాచీన కావ్యశాస్త్రం రెండర్థాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింది. ఆనందవర్ధనుడు “కావ్యానికి ఆత్మ ధ్వని” అని ఖరాఖండిగా చెప్పాడు. నేరుగా చెప్పేదానికంటే ఒక మాట వెనుక ఇంకో అర్థం గుడి గంటలా మోగడమే గొప్ప కళ అని తేల్చాడు. భర్తృహరి తన వాక్యపదీయంలో మాట మారకపోయినా సందర్భం మారితే అర్థం ఎలా మారుతుందో వివరించాడు. కానీ ఇక్కడే ఒక కుట్ర జరిగింది. ఒక పండితుడు సంస్కృతంలో ప్రతి పదానికీ రెండర్థాలు వచ్చేలా శ్లేష అలంకారంతో పద్యాలు రాస్తే దాన్ని మేధావితనం అని కీర్తించారు. అదే జానపదులు తమ కష్టాలను మరుగున పరుస్తూ అధికారంలో ఉన్నవారిని ఎగతాళి చేయడానికి పల్లె యాసలో పాడే మాటలను మాత్రం అశ్లీలం అని తీసిపారేశారు.
తంజావూరు ఆస్థానంలో ముద్దుపళని అనే స్త్రీ తన కోరికల గురించి రాసిన రాధికా సాంత్వనము అశ్లీలం అయింది. కానీ అదే శృంగారాన్ని రాసిన జయదేవుడి గీతగోవిందం మాత్రం భక్తి కావ్యం అయింది. రచనను బట్టి కాదు రచయిత స్థాయిని బట్టి తీర్పులు వస్తాయి అనడానికి ఇంతకంటే పచ్చి సాక్ష్యం అక్కర్లేదు.
ద్వంద్వార్థం అనేది బలహీనులు వేసుకునే ఒక మేధోపరమైన కవచం. ఈ దేశంలో భాషకు యజమానులం మేమే అని ఫీలయ్యే ఒక చిన్న మేధావి వర్గం జానపదుల భాషను మురికిది అని ముద్ర వేస్తుంది. ఏది బూతు ఏది కావ్యం అని నిర్ణయించే అధికారం ఆ సో కాల్డ్ పట్నపు విమర్శకుడికి ఎవరిచ్చారు? అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు చెప్పేదే ప్రమాణం అవుతుంది అని మైఖేల్ ఫూకో చెప్పిన మాట ఇక్కడ అక్షర సత్యం.
అయితే అర్థం పూర్తిగా చదివేవాడి మనసులోనే ఉంటే ఎవరైనా ఒక వాక్యాన్ని వంకరగా చదివి అందులో బూతులు వెతకవచ్చు కదా అని కొందరు తెలివిగా వాదిస్తారు. ఉంబెర్టో ఎకో లాంటి విమర్శకులు దీనికి సరైన సమాధానం ఎప్పుడో చెప్పారు. ఒక రచనను వ్యాఖ్యానించడం వేరు దాన్ని వాడుకోవడం వేరు. ఒక అర్థం స్ఫురించాలంటే ముందుగా ఆ రచన ఒక తలుపు తెరవాలి. వాక్యంలో బూతు వెతికేవాడు తలుపు గుండా కాకుండా గోడ పగలగొట్టి లోపలికి వెళ్తున్నాడు.
అలాగే ఎవరినైనా పచ్చి బూతులు తిట్టి అది నీ మనసులోని మురికి మాత్రమే నా ఉద్దేశం వేరు అని ఎవరైనా వాదిస్తే అది సృజనాత్మకత కాదు కేవలం మేధోపరమైన దివాలాకోరుతనం. ద్వంద్వార్థం అనేది సామాజిక కట్టుబాట్లను సున్నితంగా వెక్కిరించే ఒక కళాత్మక ఆయుధం. కానీ పచ్చి బూతు కేవలం అవతలి వాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి వాడే పదాలు. ఆ రెండింటికి మధ్య ఉన్న గీతను చెరిపేయడం మూర్ఖత్వం. అసాధ్యం కూడానూ!!!
చివరికి ఒక మాట. రెండర్థాలు లేకపోతే భాష ఒక శ్మశానం అవుతుంది. ఒక మాటకు ద్వంద్వార్థం ఉందా లేదా అన్నది అసలు లెక్కే కాదు. ఆ రెండో అర్థం ఎవరి కోసం పనిచేస్తోంది అన్నదే అసలైన కొలబద్ద. ఒక పల్లెటూరి పాటలో ద్వంద్వార్థం ఉంది. వాళ్ళ భాష చాలా చీప్ అని ఎవరైనా గట్టిగా అరుస్తూ వేలు చూపిస్తే ఆ వేలు నిజానికి పాట వైపు చూపించట్లేదు. ఎందుకంటే కళ ఒక అద్దం లాంటిది. అందులో రెండో అర్థం కోసం ఆబగా వెతికే విమర్శకుడికి మొదట కనిపించేది ఆ పాట కాదు తన సొంత ముఖమే.
– పిటి పార్కర్
22.10.2026
(పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో చదివిన లీటరరీ క్రిటిసిజం పేపర్లు మొత్తానికి ఈ రోజు ఉపయోగపడ్డాయి…)