మన తాతల పాటను మనకే అమ్ముతున్నారు

మీ తాత ముత్తాతలు చేలల్లో కలుపు తీస్తూ అలసట తెలియకుండా పాడుకున్న పాటకు ఇప్పుడు ఏసీ రూములో కూర్చున్న బడా మ్యూజిక్ కంపెనీ ఓనర్ అయిపోయింది. రేపు పొద్దున్న మీ ఊరి జాతరలోనో, ఇంటి గుమ్మం ముందో ఆ పాట గట్టిగా పాడితే కాపీరైట్ ఉల్లంఘన కింద మీ ఇంటికి లీగల్ నోటీసు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈమధ్య యూట్యూబ్‌ను, రీల్స్‌ను ఊపేస్తున్న ‘నాగుల కట్ట మీద’ దగ్గర్నుంచి, నిన్నమొన్నటి ‘సారంగ దరియా’, ‘నల్ల జీలకర్ర మొగ్గ’, అలాగే రామ్ మిరియాల గొంతులోంచి మార్కెట్లోకి వచ్చి పడ్డ రీమిక్స్ జానపదాల దాకా జరుగుతున్న తంతు చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాని ఒక విచిత్రమైన సాంస్కృతిక దోపిడీ కళ్లముందు కనిపిస్తుంది.
వందల ఏళ్లుగా ఏ ఒక్కడి సొంతం కాని ఒక ఉమ్మడి ప్రజా సంపదను, నాలుగు కొత్త బీట్లు వేసి, ఆఖరి లైనులో రెండు ముక్కలు మార్చి, "ఇది నా సొంత సృష్టి" అంటూ కార్పొరేట్ కంపెనీలు రిజిస్టర్ చేయించుకుంటున్నాయి.
అసలు ఈ తతంగం వెనుక ఉన్న అసలైన నగ్నసత్యం ఏమిటంటే… తమకు ఎంతో తెలివితేటలు ఉన్నాయని, తామే ఈ సమాజానికి దిశా నిర్దేశం చేసే మేధావులమని డబ్బా కొట్టుకునే సినిమా కవుల, దర్శకుల సృజనాత్మకత పూర్తిగా అడుగంటిపోయింది. కోట్లు కుమ్మరించి విదేశీ లొకేషన్లలో కెమెరాలు తిప్పినా, ఖరీదైన సౌండ్ మిక్సింగులు చేసినా జనం గుండెకు తాకే ఒక్క ముక్క కూడా రాయలేక వీళ్ల పెన్నులు తెల్లమొహం వేస్తున్నాయి. లగ్జరీ అపార్ట్మెంట్లలో కూర్చుని కాఫీలు తాగుతూ రాసే కృత్రిమ కవిత్వం చచ్చిపోయిందని అర్థమయ్యాక, వీళ్ల కన్ను సరిగ్గా అట్టడుగు శ్రామికుల మీద పడింది.
కొలంబస్ వెళ్లి అమెరికాను కనిపెట్టానని చెప్పుకున్నట్టు… తరతరాలుగా పల్లెల్లో రచ్చబండల దగ్గర, పత్తి చేలల్లో, ఫ్యాక్టరీ గేట్ల ముందు అణగారిన వర్గాలు తమ కష్టాల నుంచి, ఆకలి నుంచి, అవమానాల నుంచి అల్లుకున్న పాటలను వీళ్లు కొత్తగా "డిస్కవర్" చేశామంటూ ఫోజులు కొడుతున్నారు.
ఇది సరిగ్గా మన ఊరి బామ్మలు వందల ఏళ్లుగా ఒంటికి రాసిన పసుపును, పొలాల్లో పండించిన బాస్మతి ధాన్యాన్ని అమెరికా కంపెనీలు ల్యాబ్‌లోకి తీసుకెళ్లి కొద్దిగా రసాయనాలు అటుఇటు మార్చి "ఇది మా ఇన్వెన్షన్" అని పేటెంట్లు కొట్టేసిన దొంగ వ్యాపారం లాంటిదే. ఆనాడు దాన్ని శాస్త్రవేత్తలు బయో పైరసీ అంటే, ఇప్పుడు మన సినీ రంగం చేస్తున్నదాన్ని సాంస్కృతిక పైరసీ అనాలి. అమెరికాలో నల్లజాతి బానిసలు పత్తి చేలల్లో తెల్లదొరల కొరడా దెబ్బలు తింటూ తమ ఆక్రందనల నుంచి పుట్టించిన బ్లూస్, జాజ్ సంగీతాన్ని ఎల్విస్ ప్రెస్లీ లాంటి వాళ్లు పాలిష్ చేసి బిలియన్ డాలర్ల వ్యాపారంగా మార్చుకున్నట్టే... ఇక్కడా జరుగుతోంది. ఆ పాటలు పుట్టించిన మూల కళాకారులు ఇంకా గుడిసెల ముందే చిల్లిగవ్వ లేక చస్తుంటే, ఆ బాణీలను ఎత్తుకెళ్లిన వ్యాపారులు మాత్రం చార్టెడ్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు.
ఇటాలియన్ ఆలోచనాపరుడు ఆంటోనియో గ్రామ్షీ చెప్పిన సాంస్కృతిక ఆధిపత్యం అంటే ఇదే. పెత్తందారీ వర్గం ఎప్పుడూ పీడిత ప్రజల సంస్కృతిని పూర్తిగా తొక్కేయదు. దాన్ని అమాంతం లాక్కుంటుంది, అందులో ఉండే తిరుగుబాటు స్వభావాన్ని, నిరసన స్వరాన్ని పూర్తిగా తుడిచేసి, కేవలం నడుములూపే ఐటమ్ సాంగులాగానో, పబ్‌లలో తాగినోళ్లు గెంతే పార్టీ ట్రాకులాగానో మార్చి, మళ్లీ ఆ ప్రజలకే టిక్కెట్లు పెట్టి అమ్ముకుంటుంది. ఇక మన చట్టాల తీరైతే మరీ దారుణం. ఒక జానపద పాటలో ఎనభై శాతం ట్యూన్ అదే ఉంటుంది, డెబ్బై శాతం లిరిక్స్ అవే ఉంటాయి. అలాంటి పాట చివర్లో ఏ రచయితో వచ్చి రెండు ప్రాస పదాలు కలిపితే దానికి లీగల్ కాపీరైట్ ఇచ్చేయడం ఏ ఊరి న్యాయం?
ప్రజాధనాన్ని ఎవరైనా వాడుకుంటే జరిమానా వేయాలి కానీ, ఊరందరి ఉమ్మడి ఆస్తిని దర్జాగా లూటీ చేసి సొంత కంపెనీ పేరు మీద ముద్ర వేసుకుంటుంటే కాపీరైట్ బోర్డులు చప్పట్లు కొడుతున్నాయి. పైపెచ్చు, ఆ పాటను ఏ సామాన్యుడో పాడి నెట్లో పెడితే వాడికి కాపీరైట్ స్ట్రైక్ వేసి అకౌంట్ బ్లాక్ చేసేంత దురహంకారం ఈ బడా సంస్థలది.
జార్జ్ ఆర్వెల్ తన '1984' పుస్తకంలో గతాన్ని చెరిపివేయడం గురించి హెచ్చరించినట్టు, ఈ దోపిడీని ఇట్లే వదిలేస్తే ఇంకో పాతికేళ్ల తర్వాత వచ్చే తరానికి 'నాగుల కట్ట మీద' పాటో, 'సారంగ దరియా'నో ఫలానా కార్పొరేట్ మ్యూజిక్ డైరెక్టర్ రాసిందే తప్ప, దీని వెనుక పల్లెటూరి తల్లుల శ్రమ దాగుందనే స్పృహే మిగలదు. అట్టడుగు వర్గాల చరిత్రను, వాళ్ల అస్తిత్వాన్ని శాశ్వతంగా చెరిపేసే మహా కుట్ర ఇది. అయితే ఈ మొత్తం నాటకంలో ఒక తీపి నిజం ఏంటంటే…శ్రామిక ప్రజల, సబ్ఆల్టర్న్ జీవితాల భాష ముందు స్వయం ప్రకటిత మేధావుల భాష మోకరిల్లక తప్పలేదు. మట్టి వాసన ఉంటేనే జనం గుండె కరుగుతుందని ఈ వ్యాపార ప్రపంచం కూడా చివరికి ఒప్పుకుంది. కానీ ఆ గుర్తింపును కేవలం వాళ్ల బ్యాంకు ఖాతాలు నింపుకోవడానికే వాడుకుంటే ఊరుకోకూడదు.
ఆకాశం, గాలి, నది నీళ్లు ఎలాగైతే ఎవరి సొంతం కాదో... ప్రజా సమూహాల పెదవులపై పుట్టిన జానపదం కూడా ప్రజలందరి ఉమ్మడి నిధి. దానికి కార్పొరేట్ కంచెలు వేసే ప్రతి ఒక్కరిపై కల్చరల్ థెఫ్ట్ కేసులు పెట్టి, వారి లాభాల్లోంచి భారీ జరిమానాలు వసూలు చేసి ఆయా కళారూపాలు పుట్టిన ప్రాంతాల అభివృద్ధికి మళ్లించినప్పుడే ఈ ఆధునిక దోపిడీకి ముగింపు పడుతుంది.
– పిటి పార్కర్
06.09.2026