బ్యాక్‌స్టేజ్ బ్రహ్మ
హోదాల ముళ్ళకంచెలు
పేరుకు ముందు వేలాడే అక్షరాల అహంకారాలు
నల్లకోట్లు, తెల్లకోట్లు…
అధికారం చెలాయించే హోదాల నడుమ
ఆ పాత బడిగదిలో నిలబడే
నిశ్శబ్ద అస్తిత్వం అతడు
సమస్త గుర్తింపుల గర్భగుడికి
తానే మూలధాతువైనప్పుడు
ఆ సృష్టికర్తకు ఏ లేబుల్స్ అవసరం?
మార్కుల కార్ఖానాల్లో
కొందరు మెదళ్లను బట్టీ పట్టిస్తే
అతని చేతిలో తరగతి గది
ఒక విశ్వసృష్టి యజ్ఞం
నల్లబోర్డు పై కరిగి రాలే సుద్దముక్క
సున్నపు ధూళి కాదు
రేపటి సూర్యుళ్లను ప్రసవించడానికి
ఒక నక్షత్రం చేసే స్వచ్ఛంద ఆత్మహోమం
స్టెతస్కోప్ వినే గుండె చప్పుడులో
న్యాయం కోసం గర్జించే వాదనలో
ఆకాశం హద్దులు చెరిపే రాకెట్ పథంలో
ఎక్కడా కనబడకుండా
ప్రవహించే అదృశ్య రక్తనాళం అతడే
చెక్కబడిన రాయి గర్భగుడికి చేరి
దైవమై పూజలందుకుంటుంది
కానీ…
రాతికి ప్రాణప్రతిష్ట చేసి
నేలకొరిగిన ‘ఉలి’కి
ఏ పూలదండల గుర్తింపీ ఇవ్వదు
కొమ్మలు ఆకాశాన్ని తాకడం కోసం
చీకటి మట్టిలోనే అంతర్ధానమైపోయే
‘వేరు’ అతడు
లోకానికే కిరీటాలు తొడిగే ఆ నిశ్శబ్ద చేతికి
ఏ అక్షరాల బిరుదు సరిపోతుంది?
అస్తిత్వాన్నే ధారపోసే మూలవిరాట్టుకు
ఏ పేరు పెట్టి పిలిచినా చిన్నబోదా
ర్యాంకుల మార్కెట్లో
మెదళ్లను బేరం పెట్టేవాడు గురువు కానే కాదు
అతను వ్యవస్థ నడిపే బట్టీల వ్యాపారి
పిల్లవాడిలోని శూన్యంలో
ఒక సజీవ విశ్వాన్ని చూసి
ప్రాణప్రతిష్ట చేసే ఆ నిశ్శబ్ద శిల్పే
అతనే అసలైన మాస్టారు...
ఆమె మాత్రమే నిజమైన టీచర్
– పిటి పార్కర్
05.09.2026