పిటి పార్కర్Pity Parker

పది రూపాయల పౌరసత్వం

పది రూపాయల పౌరసత్వం: పిటి పార్కర్ కవిత పోస్టర్

ఒక చిన్న గది…
మూలన పాతబడిన పుస్తకాల కొండ
ఆరు మాసాలుగా వెచ్చని స్పర్శ పొందని పొయ్యి
జేబులో సరిగ్గా పది రూపాయల చిరిగిన కాగితం

అయినా…
కళ్ళల్లో ఎప్పటికైనా సర్కారు కొలువు కొట్టాలనే మొండి పట్టుదల
ఆకలి నరాలను లాగుతున్నా…
రేపటి విజయం ముందు
ఆ బాధ చాలా చిన్నది

తెల్లవారింది…
ఆగస్టు పదిహేను పండుగ వచ్చింది
మైకుల్లోంచి దేశభక్తి పాటలు హోరెత్తుతున్నాయి
వీధి వీధినా తనిఖీ మొదలైంది
గుండెల మీద రంగుల జెండా కనిపించకపోతే
వాడి భారతీయతకే ప్రమాదమనే చూపులు మొదలయ్యాయి

తన గుండెల్లో ఎంత ప్రేమున్నా
బయటకు చూపించకపోతే నేరమేమోనన్న భయం
జేబు తడిమి చూసుకున్నాడు
అందులో మిగిలింది ఆ ఒక్కటే పది రూపాయల నోటు
మనసులోనే ఒక చిన్న లెక్క వేసుకున్నాడు
ఐదు రూపాయలతో చిన్న కాగితపు జెండా కొందాం
మిగిలిన ఐదు రూపాయలతో…
ఒక బన్ను ముక్క తిని
ఈ రోజుకు కడుపును సముదాయిద్దాం
అటు దేశభక్తి నిలబడుతుంది
ఇటు ప్రాణం నిలబడుతుంది అనుకున్నాడు

ఆశగా బజారుకెళ్తే…
అక్కడ కొత్త సర్కారు శాసనం వినిపించింది
కాగితపు జెండాలు చెల్లవట
ప్రతి పౌరుడూ స్వదేశీ ఖాదీ జెండానే ఎగరేయాలట
ప్రభుత్వ రాయితీతో దాని ప్రత్యేక ధర సరిగ్గా పది రూపాయలట
అక్కడ వేరే జెండాలు లేవు
వేరే దారులూ లేవు

ఆకలి ముద్దకి అధికారపు కొలతకి మధ్య నలిగిపోయి
చేతిలో ఉన్న ఆ చివరి నోటును ఇచ్చేశాడు
జేబు ఖాళీ అయ్యి
చేతిలోకి అందమైన ఖాదీ జెండా వచ్చింది
ఇంటికొచ్చి కిటికీ ఊచకు గర్వంగా దాన్ని కట్టాడు
చూసిన వాళ్లంతా
వీడు నిజమైన దేశభక్తుడని మెచ్చుకున్నారు

చీకటి పడింది
కడుపులో ఆకలి మంటలు నిశ్శబ్దంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నాయి
మంచం మీద ఖాళీ కడుపుతో నడుం వాల్చాడు

కానీ కళ్ల నిండా ఇంకా చెరిగిపోని నమ్మకపు కలలు
ఏదో ఒక రోజు ఈ స్వతంత్ర దేశం
తన కడుపుకి ఇంత తిండిని
తన బతుకుకి ఒక చిన్న కొలువును
కచ్చితంగా ఇస్తుందన్న ఆశతో
ఆ త్రివర్ణ పతాకం నీడలో నిద్రలోకి జారుకున్నాడు

…

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

– పిటి పార్కర్
15.08.2026