దోసిట్లో పడ్డ 'కాలం'!
బయటి ప్రపంచం
చిన్నగా తలుపు తట్టినప్పుడు
లోపల ఏదో నిశ్శబ్దంగా కదిలిపోతుంది!
వంటగది బండపై పడిన ఒక చిన్న ఉప్పు రాయి
సాయంత్రపు ఒరిగిన ఎండలో నేలపై పరిచే ఆ పొడవైన నీడ...
పుస్తకం పుటల సందుల్లోంచి నడిచి వెళ్లే ఒక చిన్ని పురుగు...
మనసును ఏదో వింత అలజడితో కలచివేస్తుంది
కవిత్వం అంటే బలవంతంగా వెతికి పట్టుకునే ఆలోచన కాదు
దారిన పోయే కాలం
మన దోసింట్లో వాల్చిన ఒక అదృశ్య స్పర్శ!
పచ్చటి పొలంలో
ఎండను ఒంటికి పూసుకుని నిలబడే ఆవులు
దాహంతో వేసే ఆక్రోశపు అరుపులు...
అవి కేవలం గొంతులోంచి వచ్చిన వేదన వ్యక్తపరచడానికా?
లేక ఒకరి మనసును తట్టే సంభాషణా?
తనలో తాను కలవరపడటానికి…
ఎదుటివారితో మాట్లాడటానికి నడుమ...
ఈ జీవన రహస్యమంతా దాగుంది!
అక్షరాన్ని అక్షరంతో పేర్చడంలో
ఒక మధుర యాతన ఉంటుంది...
ఏ శబ్దానికి ఏ పదం సరిగ్గా ఒదుగుతుందో వెతకడంలో
ఒక ప్రయాసతో కూడిన ఆనందం దాగుంది!
ఏ గొప్ప సందేశమూ ఇవ్వాల్సిన అవసరం లేదు
ఏ ప్రపంచాన్నీ మార్చాల్సిన తొందరా లేదు...
కంటికి కనిపించిన ఒక చిన్న క్షణాన్ని
ఉన్నది ఉన్నట్లుగా అక్షరబద్ధం చేయడమే కవిత్వం!
ఏళ్ళు గడిచాక...
ఎక్కడో పాత సొరుగులోంచి దొరికిన
మన సొంత కవితనే
ఎవరో పరాయి వ్యక్తి రాసినట్లు చదువుకున్న వేళ...
కలిగే ఆ వింత ప్రశాంతత ఉందే!
అక్కడ 'నేను' అనే అహంకారం పూర్తిగా కరిగిపోయి
కేవలం ఆ సృష్టి యొక్క అనుభూతి మాత్రమే మిగులుతుంది
ఈ జగన్నాటకంలో
మనుషులమైనా,క్రిమికీటకాలైనా...
ఒక్కొక్కరం కాలపు ఒడ్డున నిలబడి
ఈ దృశ్యాలను నిశ్శబ్దంగా చూసే సాక్షులం
ఈ ప్రపంచాన్ని శ్రద్ధగా గమనించడమే ఒక అనుభూతి...
ఆ గమనింపుకు ఒక రూపాన్ని ఇవ్వడమే కవిత్వం!
– పిటి పార్కర్
04.08.2026