పిటి పార్కర్Pity Parker

రివర్స్ చార్జ్‌షీట్

రివర్స్ చార్జ్‌షీట్: కాక్రోచ్ కవిత్వం, పిటి పార్కర్

ట్రాయ్ నగరపు రాక్షస గుర్రం
ద్వారాలు దాటిన వేళ...
ఆ కుట్రను నడిపిన వ్యూహకర్తలను కాపాడి
వీధిలో ఆడుకుంటూ
ఆ చెక్కబొమ్మను చూసి నవ్విన
పసిపిల్లల "అమాయకత్వమే"
నగరపతనానికి కారణమని
విచారించిన విచిత్ర చరిత్ర ఇది!

ఏకలవ్యుడి బొటనవేలును దానంగా కోరిన వేళ...
ఆధిపత్యపు పక్షపాతాన్ని సింహాసనం వెనుక దాచి
"నీ శ్రమలో అనధికారిక ధిక్కారముంది" అని…
తెగిపడిన ఆ వేలుకే
అపరాధ రుసుము విధించిన కాలమిది!

రోమ్ నగరం బూడిదవుతున్న రాత్రి వేళ...
ఫిడేలు మీటిన సామ్రాజ్యపు వేళ్లను నిరపరాధిగా ప్రకటించి
పొగకి ఊపిరి ఆడక కేకలేసిన బూడిదను
"సమాజపు ప్రశాంతతను భంగపరిచిన ముద్దాయివు" అని
జైలులో తోసిన వైపరీత్యం ఇది!

కురుక్షేత్రంలో రథపు చక్రం
నేలలో కూరుకుపోయిన వేళ...
తన సిద్ధాంతాల డొల్లతనాన్ని దాచుకోవడానికి
"నా రాజనీతిలో పగుళ్లు లేవు... ఈ నేలకు, ఈ చక్రానికే యుద్ధధర్మం తెలియదు!"
అని నేలను, చక్రాన్ని
బోనులో నిలబెట్టిన ఆస్థాన నాటకమిది!

మహా వ్యూహాన్ని అల్లిన సూత్రధారిని
పీఠంపై కూర్చోబెట్టి
ఆ వలల నడుమ బంధించబడ్డ పావురాలకే "పద్ధతి తెలియదని"…
శిక్షలు ఖరారు చేసే దర్బారు ఇది!

తన నగ్నత్వాన్ని చూపించినందుకు...
రూపాన్ని మార్చుకునే ధైర్యం లేని పీఠం
చివరకు 'అద్దాన్ని' విచారించి
పగులగొట్టడానికి ఆర్డర్లు జారీ చేసింది

నమో సామ్రాజ్యపు యజమానీ...
రూపాన్ని సరిదిద్దకుండా
'అద్దం’ని ఎంత పగులగొట్టినా
లభించేది మీ పాలనకు వికాసం కాదు...
కేవలం మీ వ్యవస్థాగత 'అపరాధం' మాత్రమే

ముక్కలైన ఆ ప్రతీ గాజు పెంకులోనూ...
ఇప్పుడు ఒక్క ప్రతిబింబం కాదు
మీ డొల్లతనాన్ని నగ్నంగా చూసే
కోట్లాది నవతరం కళ్లు మిగిలాయి

ఈ తరం
తమ నిర్ణయాలకు 'బాధ్యత' వహిస్తుంది గానీ...
మీ పాతబడిన రాజ్య వైఫల్యానికి
'శాశ్వత ముద్దాయి'గా మారదు

– పిటి పార్కర్
04.08.2026