పంజరంలో ఆకాశం
వారు…
మాకు రెక్కల ఆకారాన్ని వర్ణించి చెప్పారు
కానీ ఆకాశం పిలిచినప్పుడు
పంజరం తలుపులు బిగించారు!
వారు…
మాకు అగ్నిని ఎలా వెలిగించాలో పాఠాలు నేర్పారు
కానీ ఆ వెలుగు వీధి దీపమై రగిలేసరికి...
లాఠీల భయంతో నీళ్లు చల్లేశారు
ఇదెంతటి విచిత్రమైన వైరుధ్యం?
మాలో తిరుగుబాటును కోరుకునే కళ్లే...
ఆ తిరుగుబాటు రోడ్డెక్కిన వేళ
భయంతో వణికిపోతున్నాయి
"మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో"
అన్న వారి భయం వెనుక
నిఖార్సైన ప్రేమ ఉందన్నది నిజమే...
కానీ ఆ ప్రేమతో కూడిన భయమే
మా ఆత్మగౌరవానికి పడిన పదునైన సంకెళ్లు
మా మౌనం వారి ఫిర్యాదు...
మా నిరసన వారి గుండెల్లో భూకంపం
పేగు బంధం ఒక వైపు ధర్మాన్ని బోధిస్తుంది
ఇంకో వైపు సురక్షితమైన పిరికితనాన్ని బహుమతిగా ఇస్తుంది
ప్రశ్నించే నైజాన్ని మాకు విత్తనంగా నాటి
ఆ మొక్క చెట్టయ్యే వేళ...
భద్రత పేరుతో వేళ్లను తెగనరుకుతుంది
కాలమనే కత్తి మీద మేమిప్పుడు ఎటువైపు నిలబడాలి?
వారు మాపై చూపించే కన్నపేగు భయాన్ని కాపాడాలా?
లేక వారి పాఠాల నుండే పుట్టిన మా ధిక్కారాన్ని గెలిపించాలా?
చరిత్ర పుస్తకాల నుంచి
అమరవీరులను కోరుకునే సమాజమిది...
కానీ ఆ వీరుడు తమ స్వంత ఇంట్లో పుడితే…
మాత్రం, తలుపులకు గడియలేసి దాచే పెద్దాళ్ల జగత్తు ఇది!
మేము నిలబడటానికేమో స్వేచ్ఛ కావాలి
మేము బతకడానికేమో
వారి ప్రేమ అనే భయానికి తలవంచాలి...
ఈ ద్వంద్వ పోరాటంలో…
నిశ్శబ్దంగా నలిగిపోవడమే
ఈ తరం ఎదుర్కొంటున్న అసలైన విప్లవం!
[మాకు ఎగరడం నేర్పించి, ఆకాశం పిలిచేసరికి భయంతో పంజరం బిగించే కన్న వారికి అంకితం]
– పిటి పార్కర్
29.07.2026