పిటి పార్కర్Pity Parker

రెసిన్ ఇన్సూరెన్స్ పాలసీ

రెసిన్ ఇన్సూరెన్స్ పాలసీ: పిటి పార్కర్ కవిత పోస్టర్

అక్కడ కాలం నడవదు
నిన్నటి గాయం రేపటికి చీము పట్టదు
గాలి వీచినా ఏ పూరేకూ వణకదు
ఏ నవ్వు వెనకా కన్నీటి చుక్క రాలదు

ఎంతటి నిర్మలమైన నిశ్శబ్దం...
సూర్యుడు అస్తమించడు
రేపటి తొందర లేదు
ఒక్క క్షణం...
ఒకే ఒక్క పరవశపు క్షణం
అలా నూరేళ్లకి గడ్డకట్టుకుపోయింది

బతుకు చక్రం కింద పడి
గిర్రున తిరిగే నాక్కూడా
అలాంటి ఒక మూల దూరి దాక్కోవాలనిపిస్తుంది

టేబుల్ మీద పడి ఉన్న
ఆ చిన్ని రెసిన్ ముక్క
గాజు కన్నీటి బొట్టులా మెరుస్తూ
ఓ దివ్యలోకాన్ని తలపిస్తోంది

ఆ విరిసిన నవ్వు వెనుక
గాజులోకి దిగకముందే
నిలువునా ఇంకిపోయిన పచ్చిదనం
ఆ అందమైన అమరత్వానికి
ముందే ఎండి శూన్యమవ్వడమే
అది చెల్లించిన ఖరీదు

సిరల్లో ప్రవహించే పసిరి నెత్తుటిని
జీవం తాలూకు ఆఖరి తేమ బొట్టునీ పిండేసి
పూర్తిగా చంపేశాకే... దక్కిందీ నిశ్శబ్దం

ఎంత విచిత్రమైన ఉచ్చు...
ఏదైనా ఒక క్షణం నచ్చగానే
దాన్ని అలాగే ఫ్రేమ్ కట్టి బంధించాలనుకుంటాం

ముడతలు పడని యవ్వనం
ముగింపు లేని పారవశ్యం...
శాశ్వతం చేయాలనుకున్న ప్రతిసారీ
దానిలోంచి ప్రాణాన్ని లాగేయాల్సిందేనా?

తీపిని కాపాడుకునే ఆరాటంలో
తేనెలోనే బిగుసుకుపోయిన ఈగలా...
దాచుకోవాలనుకున్న ఆ క్షణమే
నిలువునా ఊపిరి తీసేసే ఉచ్చు అవుతుంది

ఆనందపు క్షణంలో తడవాలని ఎంతగా ఉన్నా...
ఆ ప్లాస్టిక్ పంజరంలో బొమ్మలా బిగుసుకుపోలేను
వాడిపోవడమే లేదంటే
అసలక్కడ బతుకే లేదని అర్థం

సువాసన లేని అమరత్వం కంటే
క్షణక్షణం రాలుతూ…
మట్టిలోకి జారిపోయే
ఈ పచ్చి అశాశ్వతమే
ఎందుకో కాస్త నిజంలా ఉంది

– పిటి పార్కర్
18.10.2026